శ్రుతిమించిన దండన

కర్నూలు (ఓల్డ్‌సిటీ): క్రమశిక్షణ పేరుతో కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు శ్రుతిమించిన దండనను అమలు చేస్తున్నాయి. హోం వర్క్‌ రాయలేదని, అల్లరి చేస్తున్నారని చిన్నారులను చితకబాదడం ఇక్కడ పరిపాటిగా మారింది. కర్నూలు గాయత్రి ఎస్టేట్‌లోని నారాయణ స్కూల్‌లో మంగళవారం సాయంత్రం ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన  శివనాయక్, కవితాబాయి కుమారుడు రిత్విక్‌ నాయక్‌ ఈ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు.












మంగళవారం సాయంత్రం తరగతి గదిలో అల్లరి చేస్తుండడంతో ఓ మహిళా టీచరు ప్యాడ్‌తో విద్యార్థి తలపై కొట్టారు. తీవ్ర గాయం కావడంతో విద్యార్థి తల్లిదండ్రులు, ట్రైబల్‌ విద్యార్థి సంఘం అధ్యక్షుడు చంద్రప్ప మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయం డీఈఓ దృష్టికి తీసుకెళ్లేందుకు సాయంత్రం నుంచి ప్రయత్నిస్తున్నా స్పందించలేదని తల్లిదండ్రులు, ట్రైబల్‌ విద్యార్థి సంఘం నేత పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థిని గాయపరిచిన టీచర్‌తో పాటు నారాయణ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.